కమనీయం…రమణీయం దుబాయ్ లో వినాయకుని నిమజ్జనోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజా కలం ప్రతినిధి, సెప్టెంబర్,16 : ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు.వినాయక చవితి పండగను పురస్కరించుకుని దుబాయ్ లోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎన్నారై పెంతల ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను కమనీయం కడు రమణీయంగా ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు.ప్రతినిత్యం స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఉపవాస దీక్షలతో స్వామి వారి నామస్మరణ చేస్తూ భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.సాయంకాలం భక్తి పాటలు పాడుతూ మానవాళికి మంచి జరగాలని గణనాథున్ని వేడుకున్నారు.ఈ సందర్భంగా గురువారం కరోనా నిబంధనలు పాటిస్తూ దుబాయ్ లోని బార్ దుబాయ్ పట్టణంలో గల సముద్రతీరంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.ఆనంతరం పెంతల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగరీత్యా తాము బయట దేశాలలో ఉన్నప్పటికి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనునిత్యం గౌరవిస్తూ హిందూ పండుగలను గొప్పగా జరుపుకోవడం బాధ్యతగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.ప్రతి ఏడు గణపతి పండగను దుబాయ్ లో ఘనంగా నిర్వహిస్తామని,ఎప్పటిలాగే ఈసారి కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు అందించి నిమజ్జనం చేశామని తెలిపారు.కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడి యావత్ మానవాళికి జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా వ్యాధి పూర్తిగా అంతం కావాలని విజ్ఞేశ్వరుణ్ణి కోరుకుని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో శంకర్ పంతులు,దొంతి శ్రీనివాస్, సత్యనారాయణ, నవీన్,సురేష్,సాయికృష్ణ, మల్లేష్,రమేష్,రవి,గోపి,సంజయ్,హరనాథ్,రామారావు,అంజన్న లతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.