పేరుకే ప్రభుత్వ కళాశాల.. అంత వెతలే..
అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా
– వర్షం పడితే చెరువును తలపించే తరగతి గదులు
– అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం శూన్యం
రుద్రంగి, సెప్టెంబర్ 16,(ప్రజాకలం ప్రతినిధి)
పేరుకే ప్రభుత్వ కళాశాల.. ఇక్కడ అన్నీ సమస్యలే.. ఇలా సాగుతున్నా పాలకులు దృష్టిసారించకపోవడం గమనార్హం. ఉన్న గదులకు సరిగా కిటికీలు, తలుపులు కూడ లేవు, విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా రుద్రంగి మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. సమస్యలతో విద్యార్థులు, సిబ్బంది సతమతమవుతున్నా ఎవరి స్పందన లేదు. బోర్ బావి పని చేయక తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడ లేని దుస్థితి, మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్న నీరు తాగలేకుండా పోయింది. అలాగే నీటి కొరతతో విద్యార్థులు, సిబ్బంది మూత్రశాలకు వెళ్ళాడానికి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కళాశాల చుట్టు ప్రహారి గోడ లేక పశువులు తిరుగుతు.. చెత్త చెదారంతో కళాశాల ఆవరణ అంతా దుర్గంధం వెదజల్లుతుంది. అలాగే మందు బాబులకు అడ్డగా, అలాగే కొందరు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నరని స్థానికులు విమర్శిస్తున్నారు. కళాశాల భవన స్లాబ్ మొత్తం పెచ్చులు పెచ్చులుగా ఊడి ప్రమాదకరంగా మారింది. వర్షం వచ్చినపుడల్లా తరగతి గదులు చెరువును తలపిస్తాయి. దాదాపు కళాశాల భవనం కూలీపోయే స్థితికి వచ్చిన పట్టించుకునే నాదుడే కరువయ్యాడని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమస్యలతో ఉన్న కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాడినికి విద్యార్థులు భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్టు తయరయ్యిందని, ఊరిలో ప్రభుత్వ కళాశాల ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవలసిన దుస్థితి వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇకనైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ కళాశాలకు మరమ్మత్తులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
మూసి వేసే పరిస్థితి వస్తుంది
– ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మడుపు నవీన్ రెడ్డి
అరకొర వసతులతో ప్రభుత్వ కళాశాల ఉన్నది వాస్తవమే, కనీసం తాగడానికి నీరు కూడ లేదు, ఉన్న బోరు పని చేయడం లేదు. గదుల కొరత కూడ ఉన్నది. కళాశాలకు సమస్యలు చాలానే ఉన్నవి, ఇట్టి సమస్యలు చూసి ఏ విద్యార్థి కూడ అడ్మిషన్ తీసుకోవాడినికి ముందుకు రావడం లేదు. ఇలా అయితే కళాశాల మూసివేసే పరస్థితి రావచ్చు. నెలకొన్న సమస్యలపై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైన స్పందించి కళాశాలకు మర్మత్తులు చేపట్టాలని కొరుతున్న.