యధేచ్చగా ప్రైవేటు చిట్టీలు…
– అక్రమంగా లక్షల్లో దందా
– అధిక వడ్డీతో ప్రజల ఇబ్బందులు
– కోరుట్ల నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న చిట్టీలు
– కోరుట్లలో చిట్టి వ్యాపారి పరార్..?
మెట్ పల్లి, సెప్టెంబర్ 18(ప్రజా కలం ప్రతినిధి) : అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే చిట్ ఫండ్స్ కంపెనీ పెట్టడం ఒక్కటే మార్గమన్న ప్రచారం ఉంది. నెలసరి వాయిదాలతో చిట్టీ గ్రూపుల్లో చేర్పించడం.. అవసరానికి తప్పకుండా ఇచ్చేస్తాం. అంటూ నమ్మబలకడం. ఆ తర్వాత చేతులు ఎత్తే యడం… కోరుట్ల నియోజకవర్గంలో కొందరు ప్రయివేటు చిట్ ఫండ్స్ నిర్వాహకులకు పరిపాటిగా మారింది. అవసరమైన ష్యూరిటీలు సమర్పించినప్పటికీ ఏదో కారణం చెప్పి తిరస్కరిస్తూ, ఇంకా ఏదో కావాలంటూ చుక్కలు చూపిస్తారు. చిట్టీ ఎత్తుకున్నప్పటికీ డబ్బులు ఇవ్వడానికి నెలల తరబడి తిప్పించుకుంటారు. ఇంకా కొందరు చిట్టి నిర్వహకులైతే చిట్టీ గడువు తీరి నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని చిట్ ఫండ్స్ సంస్థల తీరు ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఎంతో నమ్మకంతో చిట్టీలు వేస్తే.. వారి నమ్మకాన్ని అపహాస్యం చేస్తూ చిట్ ఫండ్స్ నిర్వాహకులు మోసాలకు తెగబడుతున్నారు. నిబంధనలను దర్జాగా తుంగలో తొక్కతూ పబ్బం గడుపుకుంటున్నారు.
చెక్కులతో చిక్కులు…
చిట్టి ఎత్తుకున్న వారు కాళ్లరిగేలా తిరిగినా చిట్టీ డబ్బులు మాత్రం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు చెక్కులు చేతిలో పెట్టి పంపిస్తున్నారని కొందరు బాధితులు అంటున్నారు. ఆశతో బ్యాంకుకు వెళితే అకౌంట్లో మాత్రం డబ్బులు ఉండవు. ఇదేంటని అడిగితే.. బాధ్యతారాహిత్యమైన సమాధానం ఇస్తుంటారని అంటున్నారు. పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామనుకుంటే, న్యాయం జరిగే వరకు ఎంత కాలం పడుతుందో అర్థంకాని పరిస్థితి.
చిట్టి డబ్బులతో రియల్ దందా..
కోరుట్ల నియోజకవర్గంలో చిట్ ఫండ్ నిర్వాహకులు సరికొత్త వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. ఈ నిర్వాహకులు మరి కొంతమందితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నరు. కొందరు పేరున్న బడా నేతలు ఈ చిట్ ఫండ్ నిర్వహకులు సదరు నేతలు అండగా నిలుస్తున్నారన్నా ప్రచారం జరుగుతోంది.
లక్షల్లో దందా… వందల్లో బాధితులు…
కోరుట్ల నియోజకవర్గంలో అక్రమంగా లక్షల్లో చిట్టీల దందా కొనసాగుతోంది. పేద వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారితో చిట్టీలు వేయిస్తూ ముప్పతిప్పలు పెడుతున్నారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కోరుట్లలో చిట్టి వ్యాపారి పరార్…
కోరుట్ల పట్టణానికి చెందిన ఓ చిట్టి వ్యాపారి ఇటీవల పరారైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కోరుట్ల పట్టణంలో ప్రైవేటు చీటీలు నిర్వహిస్తున్న సదరు వ్యాపారి పెద్ద మొత్తంలో డబ్బులతో పరారైనట్లు ప్రచారం జరుగుతోంది.