బై.. బై.. గణేషా.. గంగమ్మ
ఒడిలోకి గణేషుడు
రుద్రంగి, సెప్టెంబర్ 20,(ప్రజాకలం ప్రతినిధి)
రుద్రంగి మండల వ్యాప్తంగా గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. మండలకేంద్రంతో పాటు ఉమ్మడి మానాల గ్రామంలోనూ నిమజ్జన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. చిన్నా, పెద్దా ఆడుతూ, పాడుతూ శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణేషులకు భక్తులు వీడ్కోలు పలికారు. మళ్లీ ఏడాదికి రా స్వామి అంటూ స్థానిక చెరువులు, కుంటలు, వాగుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ మహేశ్ బృందం చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ గణేషుని నిమజ్జనం చేసే చెరువు వద్ద లైటింగ్, త్రాగునీరు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక వినాయక చవితి పండుగ అని అన్నారు. ప్రభుత్వం సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కుల, మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ వేడుకల్లో జడ్పీటీసి గట్ల మీనయ్య, వైస్ ఎంపిపి పిసరి భూమయ్య, అన్ని గ్రామాల సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.