Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్ఈ వైద్యులు... సేవా తత్పరులు...

ఈ వైద్యులు… సేవా తత్పరులు…

ఈ వైద్యులు… సేవా తత్పరులు…
– నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ పేరిట విస్తృత సేవా కార్యక్రమాలు
– 20 ఏళ్లుగా పేదలకు అందుతున్న సేవలు
– ప్రజలచే ప్రశంసలు అందుకుంటున్న వైద్యులు చిట్నేని రఘు, హేమ రెడ్డి

మెట్ పల్లి, అక్టోబర్ 4 (ప్రజా కలం ప్రతినిధి) : ఓ వైపు వైద్యరంగంలో సేవలు అందిస్తూనే… మరోవైపు తమ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సామాజిక సేవలను అందిస్తూ తమ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా గత ఇరవై ఏళ్లుగా ట్రస్టు పేరిట తమ సేవలను కొనసాగిస్తున్నారు మెట్ పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు చిట్నేని రఘు, హేమ రెడ్డి. 2001లో మెట్ పల్లి పట్టణంలో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ పేరిట పేద ప్రజలకు తమ సహాయాన్ని అందిస్తున్నారు. ఎక్కడ.. ఎవరికి.. ఏ అవసరం వచ్చినా సకాలంలో స్పందిస్తూ తమ సేవలను అందిస్తూ ప్రజల మనలను అనుకుంటున్నారు.

2001లో చారిటబుల్ ట్రస్ట్ కు పునాది…
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మెట్ పల్లి పట్టణానికి చెందిన చిట్నేని రఘు, హేమ రెడ్డిలు వైద్య వృత్తిని ఎంచుకున్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన వారు కాబట్టి సామాన్య ప్రజల కష్టాలు తెలుసు. వైద్యరంగంలో తోచిన సహాయం అందిస్తూనే పేదలకు ఏదైనా సహాయం చేయాలన్న సంకల్పంతో 2001లో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. ఆ రోజు నుంచి నేటి వరకు ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, గుడులు బడుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలను అను నిత్యం కొనసాగిస్తున్నారు. కేవలం వారి వృత్తికి పరిమితం కాకుండా ఎదుటి వారికి ఎంతో కొంత సహాయం చేయడంలో తృప్తి ఉంటుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ విలువైన సమయం తో పాటు కొంత సొమ్మును వచ్చేస్తూ స్ఫూర్తిదాయకంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

సేవలు ఇలా…
నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా పేదలకు అందకుండా ఉండే వైద్యాన్ని వారి గ్రామానికి తీసుకెళ్లి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు. అవసరమైనవారికి మందులు పంపిణీ చేయడంతో పాటు, ఉచితంగా శస్త్రచికిత్సలు సైతం చేయించారు. ఇందులో అధికంగా గర్భసంచి ఆపరేషన్లు, కణతి ఆపరేషన్లు, వికలాంగులకు ఆపరేషన్లు చేయించారు. ఆయా గ్రామాల్లో గ్రామ కమిటీల ద్వారా సమాచారాన్ని సేకరించి అవసరమైనవారికి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అవసరమైన గ్రామంలో మంచినీటి ట్యాంకులు ఏర్పాటు, బోరుబావిల ఏర్పాటు, కుల సంఘాల భవనాల నిర్మాణాలు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు, బడుల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం ఇలా అన్ని రకాల సేవలను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వర్ష కొండ గ్రామంలో బీసీ కాలనీ లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి మంచినీటి ట్యాంకు ఏర్పాటు చేయడం, ఏర్దండి గ్రామంలో భారత మాత విగ్రహం ఏర్పాటు, మల్లాపూర్ మండలం ముత్యంపేటలో దోబీఘాట్ లో ఏర్పాటు చేయించడం, మెట్ పల్లి మండలం ఆరపేట గ్రామంలో ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం ఇలా వందలు, వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు కొనసాగించారు. రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారు. గతంలో మహబూబ్ నగర్లో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన బాధితులను అవసరమైన సహకారం అందించారు. సుమారు రూ. నాలుగు లక్షల వరకు ఖర్చు చేసి అక్కడి ప్రజలకు మందులు, దుప్పట్లు, బట్టలు, బియ్యం పంపిణీ చేశారు.

గ్రామాల్లో విస్తృతంగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు
కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలు, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, కోరుట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. స్థానిక వైద్యులతో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వైద్యులను రప్పించి కార్పొరేట్ స్థాయి వైద్యం అని ఇక్కడి ప్రజలకు అందించారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడం, ఉచితంగా మందులు పంపిణీ చేయించడం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలో నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ సేవలకు నిలయంగా మారింది.

పేదలకు అందించే సేవలోనే సంతృప్తి…
– ప్రముఖ వైద్యులు చిట్నేని రఘు, నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మెట్ పల్లి.

సమాజంలో పలు రకాల ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి వారికి సేవ చేస్తేనే అసలైన సంతృప్తి లభిస్తుంది. పేదలకు సేవే లక్ష్యంగా మెట్ పల్లిలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించడం జరిగింది. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాము. భవిష్యత్తులో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తము. ట్రస్టు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే మెట్ పల్లి ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేస్తాము.

ట్రస్టు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
– ప్రముఖ డాక్టర్ హేమ రెడ్డి, ట్రస్టు నిర్వాహకులు, మెట్ పల్లి.

సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెట్ పల్లి నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు ఆపదలో ఉండి తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి అవసరమైన సహకారం అందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వైద్యపరమైన సహాయ సహకారాలు అందించాము. గ్రామీణ స్థాయిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కష్టతరం. అలాంటివారికి మా తరఫున, మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఉంటాము.

20 ఏళ్లుగా సేవలు అందించడం గొప్ప విషయం..
– శివా రెడ్డి, జగ్గసాగర్.

చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి 20 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఎంతో మంది పేదలు సరైన వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారికి డాక్టర్ రఘు, డాక్టర్ హేమ రెడ్డి వారు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం చాలా సంతోష దాయకం. అన్ని వర్గాల వారికి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందుతున్నాయి. మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

వైద్య సేవలు బాగుంటాయి
సీర్ణం రాజేందర్, రేగుంట.

డాక్టర్లు చిట్నేని రఘు, హేమ రెడ్డిలు అందిస్తున్న వైద్య సేవలు బాగుంటాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో లభించే వైద్యసేవలు పల్లెల్లో మాలాంటి వారికి అందించడానికి ఈ డాక్టర్ల ఎంతో కృషి చేస్తున్నారు. వీరి సేవలు ప్రజలకు ఇంకా అవసరం. ముందు ముందు ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేసి మన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారని ఆశిస్తున్నాము. నిరంతరం ప్రజల సంక్షేమాన్ని కోరే ఈ వైద్యులు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments