మాజీ మంత్రి ఆశయసాధనకు కృషి చేస్తాం…
– కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి సోదరులు
– మెట్ పల్లిలో ఘనంగా మాజీమంత్రి జువ్వాడి జయంతి వేడుకలు
మెట్ పల్లి, అక్టోబర్ 4 (ప్రజా కలం ప్రతినిధి) : ప్రజల నాయకుడు, మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు ఆశయసాధనకు కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి సోదరులు నర్సింగరావు రావు, కృష్ణా రావు అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని చెన్నకేశవ నాథస్వామి ఆలయ ఆవరణలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దివంగత జువ్వాడి రత్నాకర్ రావు తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని, ప్రజల కోసం కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి, పన్నెండేళ్ల పాటు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌గా, 1981లో జగిత్యాల సమితి అధ్యక్షులుగా, ధర్మపురి ఆలయ కమిటీ మొదటి పాలక మండలి చైర్మన్ గా అపూర్వమైన సేవలు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా జువ్వాడి రత్నాకర్ రావు ప్రజలకు ఎనలేని సేవలను అందించారని గుర్తు చేశారు. దేవదాయ శాఖ మంత్రిగా అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన గొప్ప నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు అని పేర్కొన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మాజీ ఉప సర్పంచ్ జెట్టి లింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి పట్టణ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు రాంప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు జెట్టి లక్ష్మణ్ కోటగిరి చైతన్య, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొట్ట ప్రేమ్, కంబ సురేష్, అరుణ్, హరీష్, గోనెల రాజేష్, రంగు అశోక్, జెట్టి శ్రీను,ప్రణయ్, పి. శీను, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.