Wednesday, July 6, 2022
Google search engine
Homeస్పోర్ట్స్కోహ్లీకి కౌంటర్‌ ఇస్తారా..?

కోహ్లీకి కౌంటర్‌ ఇస్తారా..?

కోహ్లీకి కౌంటర్‌ ఇస్తారా..? బీసీసీఐ ఏం చేయనుంది..?
టీమ్‌ఇండియా క్రికెట్‌లో సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరిదీ ఒకేరకమైన ఆలోచనా విధానం..

ఒకే రకమైన మనస్తత్వం… అదే ‘దూకుడు’. దీంతోనే ప్రత్యర్థి సై అంటే సై అన్నారు… ఎప్పుడూ పైచేయిగానే నిలిచారు. ఈ ఇద్దరూ జట్టును ముందుండి నడిపించడంలో, సవాళ్లను ఎదుర్కోవడంలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అలాంటిది ఈ ఇద్దరి నోటా ఒకే విషయంలో… భిన్న స్వరాలు వినిపించాయి. దీంతో ఇప్పుడు టీమ్‌ఇండియా క్రికెట్‌లో కొత్త వివాదానికి తెరలేచింది. వన్డే కెప్టెన్సీ వ్యవహారంలో కోహ్లీ వ్యాఖ్యలపై… గంగూలీ నేరుగా స్పందించకుండా బీసీసీఐనే చూసుకుంటుంది అనడం… ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అగ్గి రాజుకుంది అక్కడే..

క్రికెట్‌లో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ఆటగాళ్లు ఎవరైనా తమ బోర్డుకు లేదా అధికారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదు. ఇది కనీస ధర్మం అని క్రికెట్‌ పండితులు చెబుతుంటారు. కానీ, బుధవారం మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు… కోహ్లీ ఇచ్చిన సమాధానాలు వివాదానికి ఆజ్యం పోసేవిగా ఉన్నాయి. తొలుత టీకప్పులో తుపానులా కనిపించిన ‘వన్డే కెప్టెన్సీ తొలగింపు’ వ్యవహారం… కోహ్లీ కామెంట్స్‌తో పీక్స్‌కి చేరింది. తొలుత కోహ్లీ స్వయంగా టీ20ల కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి పొట్టి ప్రపంచకప్‌ అనంతరం అదే పనిచేశాడు. అయితే, కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ప్రకటించినప్పుడు సెలెక్షన్‌ కమిటీ కోహ్లీని వన్డే సారథిగానూ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నపళంగా ఆ నిర్ణయం ప్రకటించడంపై… అభిమానులు, పరిశీలకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గంగూలీ మీడియా ముందుకు వచ్చాడు. కోహ్లీ టీ20ల నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడే తాము ఆ పనిచేయొద్దని వారించామని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల ఆటకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదని భావించి సెలెక్షన్‌ కమిటీ వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుందని వెల్లడించాడు.

విలేకర్లు అడిగిన ప్రశ్నకే కోహ్లీ సమాధానం..
అయితే, ఈ విషయంపై తొలుత మౌనంగా ఉన్న విరాట్‌ కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీ పక్కకు తప్పుకుంటాడనే పుకార్లూ మొదలయ్యాయి. దీంతో సమావేశంలో విలేకర్లు అతడిని వన్డే కెప్టెన్సీ తొలగింపు, జట్టులో కొనసాగడం తదితర విషయాల గురించి పలు ప్రశ్నలు సంధించారు. వాటికి కోహ్లీ జవాబులిచ్చాడు. అయితే, అదే సమయంలో.. తాను సెప్టెంబర్‌లో టీ20 కెప్టెన్‌గా తప్పుకొంటానని చెప్పినప్పుడు బీసీసీఐ అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదని చెప్పాడు. ఇదే క్రమంలో మరో ప్రశ్నకు తనని వన్డే సారథిగా తొలగిస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. టెస్టు జట్టును ప్రకటించడానికి కేవలం గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ వివరించాడు. దీంతో కోహ్లీ – గంగూలీ మాటలకు పొంతనే లేకుండా పోయింది. ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని, దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌ సైతం బోర్డును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు క్రికెట్‌ అభిమానుల్లోనూ ఇదే అభిప్రాయం కలుగుతోంది.

కోహ్లీకి కౌంటర్‌ ఇచ్చేందుకు నిపుణుల సలహాలు..

ఈ విషయాలన్నీ పక్కనపెడితే గురువారం ఉదయం కోహ్లీతో సహా టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కానీ, కోహ్లీ వ్యాఖ్యలు బీసీసీఐని ఇరకాటంలో పెట్టాయి. పైకి కోహ్లీ చెప్పిన మాటల్లో నిజం లేదని కొందరు అధికారులు అంటున్నా, అతడికి సరైన విధంగా బదులిచ్చేలా బోర్డు.. నిపుణుల సాయం కోరిందని సమాచారం. అయితే, ఈ విషయంలో ఇకపై బీసీసీఐలో ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారట. ఇందులో బీసీసీఐ అధ్యక్ష కార్యాలయ పరువు ముడిపడి ఉండటంతో జాగ్రత్తగా వ్యవహరించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గంగూలీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ వివాదాన్ని ఇకపై బోర్డు చూసుకుంటుందని, ఆ అంశాన్ని వదిలేయాలని చెప్పాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఏ వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా… అది జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రమాదం పొంచి ఉందని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

కోహ్లీ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. కోహ్లీని వన్డేల నుంచి తొలగిస్తేనే ఇంత చర్చ జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తే… ఇబ్బందులు తప్పవు అని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ప్రపంచ క్రికెట్‌లోనూ టీమ్‌ ఇండియా ప్రతిష్ఠపై మచ్చపడే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను అన్నీ పరిగణనలోకి తీసుకోవడానికి బీసీసీఐ నిపుణుల కమిటీ వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో భారత క్రికెట్‌కు ఇలాంటి పరిస్థితులు పెద్దగా పరిచయం లేవు. ఇద్దరు ఆటగాళ్లు, కోచ్‌ – ఆటగాడు, కెప్టెన్‌ – సీనియర్‌ ఆటగాళ్ల మధ్య వివాదాలు మాత్రమే తెలుసు. ఏకంగా బీసీసీఐ- కెప్టెన్‌ మధ్య ఈ స్థాయి వివాదాలు చూడలేదు. దీంతో పరిస్థితి ఎటువైపు వెళ్తుందో అనే ఆందోళన క్రీడాభిమానుల్లో ఉంది.

ఇక్కడితో ముగిస్తే మంచిది..

ఏదేమైనా భారత క్రికెట్‌లో అధ్యక్షుడిగా గంగూలీ ఎంత ముఖ్యమో.. ఆటగాడిగా కోహ్లీ సైతం అంతే ముఖ్యం. అనవసరంగా ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయకుండా ఇక్కడితో ముగింపు పలకాలని పలువురు మాజీలతో సహా సగటు క్రికెట్‌ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ వివాదంలో తప్పు ఒప్పులను పక్కనపెట్టి భవిష్యత్‌పై దృష్టిసారించడం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. అయితే, అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కాబట్టి.. రాబోయే రోజుల్లో బీసీసీఐ ఏం చేస్తుందో ఆసక్తికరం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments