జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్28,(ప్రజాకలం)
సైకిళ్లను ఎత్తుకేలుతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకున్నట్లు జగిత్యాల అడిషనల్ ఎస్పీ రూపేష్ తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన గట్ల నాగరాజు అనే యువకుడు గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ నేరాలకు పాల్పడుతున్నాడు. తనతోపాటు కోరుట్ల పట్టణానికి చెందిన మరో ఇద్దరు మైనర్ బాలులను వెంటపెట్టుకొని ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని రోజులుగా జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యం చేసుకుని వాటిని దొంగిలిస్తూ కోరుట్ల పట్టణానికి చెందిన షేక్ నజీర్ అను స్క్రాప్ దుకాణం యజమానికి వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున కోరుట్ల పట్టణంలో అనుమానాస్పదంగా కనిపించిన గట్ల నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటిని అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.వాటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా నిందితులను పట్టుకోవడంలో మెట్ పల్లి డీఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, ఎస్సైలు చిర్ర సతీష్, శ్యామ్ రాజ్ లు, సిబ్బంది విజయ్,ఎల్లయ్య, శ్రీధర్, వినోద్, సత్తయ్య, సంతోష్,రాజేష్ లను అడిషనల్ ఎస్పీ రూపేష్ అభినందించారు.