Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరేదెప్పుడో...?

ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరేదెప్పుడో…?

ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో చేరేదెప్పుడో…?
– ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఇంకా విధులకు దూరంగానే..
– ఆశలు రేపినా అందని అధికారిక ఆదేశాలు
– జిల్లాలో ఉపాధి పనులపై కరువవుతున్న పర్యవేక్షణ
యాచారం, ఏప్రిల్‌ 29, (ప్రజాకలం ప్రతినిధి): సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వేటు వేసిన ప్రభుత్వం రెండేళ్ల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లలో ఆనందం వెల్లువిరిసింది. జిల్లా వ్యాప్తంగా కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అయితే సీఎం ప్రకటన చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ అధికారికంగా ఆదేశాలు జారీ కాలేదని సంబంధిత అధికారులు చెప్పడంతో మళ్లీ నిరాశనే కనిపిస్తోంది. అసలు ప్రకటించిన విధంగా విధుల్లోకి తీసుకుంటారా.. ఇంకేమైనా షరతులు విధిస్తారా అనే దానిపై స్పష్టత కనిపించడం లేదు. జిల్లాలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధులకు తీసుకుంటేనే కూలీలకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌ఏలను విధులకు దూరం చేయడంతో కొంతమంది ప్రత్యామ్నయంగా ఉపాధిని పొందుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఎంత మంది విధుల్లో చేరుతారో స్పష్టత రానుంది.
విధులకు దూరమై రెండేళ్లు!
ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని 2020 మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ప్రభుత్వం హెచ్చరించినా వెనక్కి తగ్గక పోవడంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి అందుబాటులో ఉన్న మేట్‌లతో ఉపాధి పనులను నెట్టుకొస్తున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పలుమార్లు ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలతో పాటు స్వయంగా కలిసి వినతులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తించాయి. స్వయాన సీఎం ప్రకటించి రెండు మాసాలు గడుస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడినట్లు కనిపించడం లేదు. అధికారిక ఆదేశాలు రాక పోవడంతో మళ్లీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల విధుల పై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ కార్యదర్శులపై పని భారం
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం పెరగడంతో ఉపాధి పనుల పర్యవేక్షణ కరువవుతోంది. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కూడా కొనసాగడం వాటికి సంబంధించిన ప్రగతి నివేదికలు ఇతర పనులతో కార్యదర్శులు ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద చేపట్టే సీసీ రోడ్లు, కల్లాలు, నర్సరీల నిర్వాహణపై దృష్టి సారించలేకపోతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కరువవడంతో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతికి గ్రామ కార్యదర్శులను బాధ్యులుగా చేయడంతో కొన్ని సందర్భాల్లో సస్పెన్షన్‌కు గురవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు పంచాయతీ విధులు, అటు ఉపాధి పనుల పర్యవేక్షణ కష్టంగానే మారుతుందని పలువురు కార్యదర్శులు జిల్లా అధికారులకు మొర పెట్టుకున్న సందర్భాలు కూడా లేక పోలేదు. ఇలాంటి పరిస్థితులతో కూలీల ఇబ్బందులను పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు. మెట్లు కేవలం హాజరుశాతాన్ని నమోదు చేసేందుకే పరిమితమవుతున్నారు. కూలీల సంఖ్యను పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments