ఆసరాకు ప్రతినెల ఎదురుచూపులే
– లబ్ధిదారులకు తప్పని తిప్పలు
– ఎప్పుడూ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో లబ్దిదారులు
– నెలనెలకి ఆలస్యంగా ఆసరా పింఛన్ల పంపిణీ
యాచారం, మే 11, (ప్రజాకలం ప్రతినిధి): ఆసరా పింఛన్లు సకాలంలో లబ్ధిదారుల చేతికందడం లేదు. ప్రతినెల మొదటి వారంలోపు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆఖరి వరకు విడుదలకాని పరిస్థితి కొనసాగుతోంది. పింఛను డబ్బులపై ఆధారపడే వృద్ధులు, వితంతవులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఏ రోజు ఇస్తారో తెలియక గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు నిత్యం పోస్టాఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పేదలకు ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతినెల దివ్యాంగులకు రూ.3,016, వితంతు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ రోగులకు రూ.2,016 చొప్పున అందించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల వద్ద బీపీఎంలు పంపిణీ చేయగా.. మున్సిపల్ ప్రాంతాల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా వేస్తారు. అన్ని రకాల పింఛన్లకు కలిపి చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. నెలకు రూ కోట్లలో పంపిణీ చేయాల్సి ఉంటుంది.
వేలిముద్రలు పడక ఇబ్బంది
గ్రామాల్లో పింఛను డబ్బులు బయోమెట్రిక్ ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 30 వేల మంది వృద్ధులకు వేలిముద్రలు పడటం లేదు. వీరికి బీపీఎం వేలిముద్రలు వేసి డబ్బులు ఇవ్వాలి ఉంది. నడవలేని వారు ఉంటే.. బీపీఎంలు వారి ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. గ్రామాల్లో పింఛను డబ్బులు పంపిణీ పూర్తి అయిన తర్వాత చివరగా బీపీఎం వేలిముద్రలు వేసి వృద్ధులకు డబ్బులు ఇస్తున్నారు. దీనివల్ల అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది.
ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇబ్బందే
ఎలాంటి ఆధారం లేని ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛనే ఆసరా. చాలా మందికి ఈ డబ్బులు వస్తేనే మందులు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉంది. సమయానికి పింఛను రాకపోవడంతో ఒక్కోసారి అప్పు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతినెల ఇదే తంతు ఉండటంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు.
బ్యాంకులో వేస్తేనే మేలు
నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో ఆసరా లబ్ధిదారులకు పింఛను డబ్బులు ప్రతినెల నేరుగా వారి బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. గ్రామాల్లో మాత్రం ఇంకా ఈ ప్రక్రియ చేపట్టడం లేదు. ఏడాది క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పొందుతున్న వారి నుంచి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. వాటిని ఆన్లైన్లో పొందుపర్చారు. ఇక డబ్బులు వేసే ప్రక్రియ చేపడితే వృద్ధులకు పోస్టాఫీసుల వద్ద నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందనీ పలువురు ఆసరా లబ్దిదారులు కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పై తిరుగుబాటు తప్పదని పలువురు వికలాంగుల సంఘాల నాయకులు హెచ్చరించారు.