– రహదారులపైనే వాహనాల పార్కింగ్
– పట్టించుకోని అధికారులు, ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
మెట్ పల్లి ప్రతినిధి, (ప్రజాకలం) : మెట్ పల్లి డివిజన్ కేంద్రంలో ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా జాతీయ రహదారితో పాటు పట్టణంలోని పలు అంతర్గత రహదారులపైనే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లిపోవడంతో పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి బస్ డిపో ప్రాంతం వరకు నిత్యం జాతీయ రహదారిని అనుకుని ఉన్న దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థలకు వచ్చే కొంతమంది తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో కాకుండా దుకాణాలు, వ్యాపార సంస్థల ముందే జాతీయ రహదారిపై పార్కు చేసి వెళ్ళిపోతున్నారు. తిరిగి వారు వచ్చే వరకు రోడ్డుపైనే వాహనాలు ఉండడంతో ఫుట్ పాత్ పై ప్రయాణించే పట్టణ ప్రజలు, ఇతర వాహన చేతకులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కు చేసిన వాహనాలు జాతీయ రహదారిని సగం వరకు ఆక్రమించడంతో అప్పుడప్పుడు పలు సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీరడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. జాతీయ రహదారి గుండా నిత్యం పరివేక్షణ జరపాల్సిన సంబంధిత ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోకపోవడంతో సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో, అంబులెన్స్ వెళ్లే సమయాల్లో అక్కడక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. సంబంధిత దుకాణ యజమానులకు, వ్యాపార సంస్థ నిర్వాహకులకు ఆయా శాఖల అధికారులు అవసరమైన కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయ రహదారిపై వాహనాలు పార్క్ చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
prajakalamhttp://prajakalam.com/wp-content/uploads/2025/02/Prajakalam-EP-15th-copy-2.png