అక్రమ నిర్మాణాల్లో కాసుల పంట
నాగిశెట్టిపల్లి లో యదేచ్చగా అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణం
★—నిర్మాణం పూర్తయినా నోటీసులు జారీ చేయని కార్యదర్శి
★—నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు
★—ఎనిమిది రోజులు సెలవు పెట్టాను.. ఆలోపు నిర్మాణం పూర్తయింది
★—జిల్లా అధికారులు ఆదేశాలిస్తే గెస్ట్ హౌస్ పై చర్యలు
★——-నాగిశెట్టి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి
శామీర్ పేట్ / ఫిబ్రవరి 05 ( ప్రజా కలం ప్రతినిధి ):
అనుమతిలేని నిర్మాణాలు మండలంలో నిత్యకృత్యమయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతూ వాటికి పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కి బేకాతరు చేస్తున్నారు.. గ్రామ/మండల స్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా….? లేక ఒత్తిడిలో పనిచేస్తున్నారా…? తెలియని పరిస్థితి దాపురించింది. విషయానికొస్తే మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం నాగిశెట్టిపల్లి లోని సర్వే నంబర్ 4/C/అ/అ/1/2 లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. మూడు నెలలుగా అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని యదేచ్చగా ప్రారంభించారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని నాలా కన్వెన్షన్ చేసుకుని, గ్రామపంచాయతీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను పొందిన తదుపరి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కానీ అవేవి తనకు పట్టనట్లు నిర్మాణదారులు యదేచ్చగా గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టి ప్రారంభించారు. మూడు నెలలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ తూ తూ మంత్రంగా నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేయాల్సిన గ్రామ స్థాయి అధికారి అదేమీ చేయకపోవడంతో పనులు పూర్తయ్యాయి. క్షేత్ర స్థాయిలో బాధ్యత వహించాల్సిన సదరు అధికారి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ, ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లకపోవడం గమనార్హం. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు ధోరణితో నిబంధనలు పాటించకున్నప్పటికి అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు పూర్తిచేసుకున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గ్రామ కార్యదర్శి వివరణ:
ఇట్టి విషయంపై నాగిశెట్టి పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా…. మూడు నెలలుగా వ్యవసాయ క్షేత్రంలో అక్రమ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందిగా గతంలో హెచ్చరిక జారీ చేసినా సంబంధిత నిర్మాణదారుడు పనులు నిలివిపివేయలేదు అని తెలిపారు. నిర్మాణ సమయంలో 8 రోజులు సెలవు పెట్టానని ఆలోపు నిర్మాణం పూర్తి దశకు చేరుకుందన్నారు. పూర్తయిన గెస్ట్ హౌస్ నిర్మాణదారునికి బుధవారం మొదటి నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులు ఆదేశాలిస్తే గెస్ట్ హౌస్ పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.