నకిలీ సమాచారంపై పోరు
ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడంపై
పోరాడటానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పరిష్కారాల్ని ఆవిష్కరించనున్న వేవ్స్ 2025
హైదరాబాద్, ఇండియా – ఫిబ్రవరి 04, (ప్రజాకలం ప్రతినిధి)
ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సహకారంతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ‘ట్రూత్‌టెల్ హ్యాకథాన్ చాలెంజ్’ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్.. ‘వేవ్స్’) 2025లోని క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్ (సీఐసీ)కి చెందిన ఒకటో సీజనులో ఈ హ్యాకథాన్ ఓ భాగంగా ఉంది. ఈ చాలెంజ్.. ప్రత్యక్ష ప్రసారంలో తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న ధోరణులను పరిష్కరించడానికి కృత్రిమ మేధ (ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్- ఏఐ) చోదక శక్తిగా నిలిచే పరిష్కారాలను అభివృద్ధిపరచాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం.
నకిలీ సమాచారంపై పోరు
ప్రస్తుతం ప్రసార మాధ్యమాలు చాలా వేగంగా విధులను నిర్వహిస్తున్నాయి. అంతే వేగంగా తప్పుడు సమాచారం చలామణీ అవుతోంది. వాస్తవాల ప్రాతిపదికన తప్పుడు సమాచారాన్ని గమనించే సవాలు ప్రసార సంస్థలకు, జర్నలిస్టులతోపాటు ప్రేక్షకులకు కూడా క్లిష్టంగా ఉంటోంది.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి లోకి తెస్తున్న వర్గాల ఆచూకీని కనిపెట్టి, నిజాన్ని నిగ్గుతేల్చేందుకు కృత్రిమ మేధను ఉపయోగించుకొంటూ కొన్ని సాధనాలను రూపొందించాల్సిందిగా డెవలపర్లను, డేటా సైంటిస్టులను, మీడియాలోని వృత్తినిపుణులను ఈ హ్యాకథాన్ కోరుతోంది. దీనికోసం రూ.10 లక్షల విలువైన బహుమతులను ఇవ్వనున్నారు. గెలిచే జట్లకు నగదు బహుమతులను ఇవ్వడం, మార్గదర్శకత్వాన్ని అందించే అవకాశాలను కల్పించడంతోపాటు ప్రాథమిక దశలో ప్రముఖ సాంకేతిక నిపుణుల వద్ద నుంచి సహాయసహకారాలను కూడా అందజేయనున్నారు.
ఇప్పటి వరకు, హ్యాకథాన్ లో పాల్గొనదలచిన వారి వద్ద నుంచి చక్కని ప్రతిస్పందన వచ్చింది. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి 5,600కు పైగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు ముందుకువచ్చి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయించుకొన్నారు. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనదలుస్తున్న వారిలో 36 శాతం మంది మహిళలున్నారు.