Saturday, April 5, 2025
HomeUncategorizedఆర్థిక సంక్షోభంలో గ్రామ పంచాయతీలు'

ఆర్థిక సంక్షోభంలో గ్రామ పంచాయతీలు’

ఆర్థిక సంక్షోభంలో గ్రామ పంచాయతీలు’

*గ్రామ పంచాయతీల దుస్థితిపై ప్రజా కలం దిన పత్రిక ప్రత్యేక కథనం…*

 
– పాలకవర్గాలు లేక గాడి తప్పిన పల్లె పాలన’….

– కార్యదర్శులను వేధిస్తున్న తీవ్ర నిధుల కొరత

– పంచాయతీలకు రాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు

– జీపిల్లో రోజువారీ పనులకూ డబ్బుల్లేవు..

– పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం..

– అప్పుల పాలవుతున్న పంచాయతీ కార్యదర్శులు

 

ఫోటో : గ్రామపంచాయతీ ట్రాక్టర్, గ్రామ ముఖచిత్రం.

 

 

*ఎల్లారెడ్డి ఫిబ్రవరి 20 ప్రజా కలం ప్రతినిధి :* రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయడం లేదు. దీంతో పల్లెలను నిధుల కొరత వేధిస్తున్నది. ఆదాయ వనరులు అంతగా లేని పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర ఖర్చులకు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. అభివృద్ధి పనుల మాట దేవుడెరుగు.. కనీసం వేతనాలు, కరెంటు బిల్లులు, ఈఎంఐలకైనా నిధులు ఇవ్వండి మహాప్రభో అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

 

*గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం… వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు…*

 

పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్త సేకరించే ట్రాక్టర్లకు కనీసం డీజిల్‌ కూడా పోసే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు దవాఖాన పాలవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం, పచ్చదనం, బతుకమ్మ, దసరా పండగ సంబరాలకు నిధుల లేమి సమస్యగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 

 

*జీపీలు నాడు కళకళ.. నేడు వెలవెల..*

 

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అధిక ప్రాధాన్య మిచ్చింది. కేంద్రం నుంచి వచ్చే నిధులకు అంతే మొత్తంలో జమ చేసి నెలకు రూ.250 కోట్లకుపైగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు సాఫీగా జరిగేవి. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో చూడముచ్చటగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నిధుల విడుదల ఆగిపోవడంతో అన్ని పనులు బంద్‌ అయ్యాయి. గత పది నెలల్లో పంచాయతీలకు దాదాపు రూ.2,500 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద దాదాపు మరో రూ.1,300 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉన్నదని మాజీ సర్పంచ్‌లు చెప్తున్నారు. తాము అనేకసార్లు ప్రభుత్వాన్ని, గవర్నర్‌ను, ప్రతిపక్షాలను కలిసినా ఫలితం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

*అప్పుల పాలవుతున్న కార్యదర్శులు…*

 

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కార్యదర్శులే చిన్నచిన్న పనులకు కూడా నిధులు లేకపోవడంతో వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుంటే వాటిని ఎలా తీర్చాలోనని మధనపడుతున్నారు. తమకు వచ్చే జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉందని దీనికి తోడు పంచాయతీల ఖర్చులు తామే భరించాల్సి రావడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.

 

*ఎన్నికలు నిర్వహించక పోవడంతో గాడి తప్పిన పాలన….*

 

గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి సుమారు 14 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఫిబ్రవరి 2న ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల లేమి, సిబ్బంది జీతాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పంచాయతీ పాలన గాడితప్పుతున్నది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనుల కోసం బ్లీచింగ్‌ పౌడర్‌, చెత్త సేకరణ, మురుగు కాలువల్లో పూడికతీత, విద్యుత్తు దీపాల ఏర్పాటు, తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలు, ట్రాక్టర్లకు డీజిల్‌ కొరత తదితర సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ప్రత్యేకాధికారులు సైతం చేసేదేమీ లేక పంచాయతీలను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి
*వేసవిలో నీటి ఎద్దడి తీరేది ఎలా….
రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలో బోరు బావులు వట్టిపోయినట్లు సమాచారం. దీంతో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు. నూతనంగా బోరుబావులు తవ్వించాలంటే నిధులు కావలసిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో రానున్న వేసవి కాలంలో తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది పెద్ద సవాల్ గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments