Friday, April 4, 2025
Homeజాతీయంసృజనకు సరికొత్త రూపం

సృజనకు సరికొత్త రూపం

సృజనకు సరికొత్త రూపం: ప్రపంచ వినోద రంగ ముఖచిత్రాన్ని మార్చనున్న వేవ్స్ 2025
హైదరాబాద్:మార్చి22 (ప్రజాకలం) అసలైన కథలు, వినూత్నమైన వినోదాల కోసం పరితపిస్తోన్న ఈనాటి పరిస్థితుల్లో ప్రపంచ మీడియా రంగ రూపురేఖలను మార్చేందుకు భారత్ ‌సిద్ధమైంది. ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద సదస్సు (వేవ్స్) మీడియా, వినోద రంగానికి సంబంధించిన ఓ అసాధారణ కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలు (క్రియేటర్స్), విధాన రూపకర్తలు, ప్రేక్షకులు కంటెంట్‌లో నిమగ్నమయ్యే తీరులో మార్పు తెస్తూ సరికొత్త నిర్వచనాన్ని అందిస్తుంది. 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలో వేవ్స్ కార్యక్రమం ప్రారంభం కానున్నది. సృష్టికర్తల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో ఇదే గొప్పది. వినోదానికి సంబంధించిన వాతావరణాన్ని సృష్టించటంలో- ప్రపంచ వినోద రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నది.
దశాబ్దాలుగా… భారత్‌ ‌తన సినిమాలు, సంగీతం, డిజిటల్ కంటెంట్‌తో ప్రపంచాన్ని ఆకర్షించే కథలకు పుట్టినిల్లుగా ఉంది. సృతనాత్మకత విషయంలో గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ ప్రపంచ వినోద పరిశ్రమ గతిని నిర్దేశించే స్థాయికి చేరుకోలేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘వేవ్స్’ కార్యక్రమం ప్రయత్నిస్తుంది. వేవ్స్ అంటే కేవలం భారతీయ సృజనాత్మకతను ప్రదర్శించటం వరకే పరిమితం కాలేదు. మీడియా, వినోదం, సాంకేతికతలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆలోచనలకు సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నది. ఆర్థిక విధానానికి కేంద్రం దావోస్ అయితే, సినిమాకి ఆలయం వంటిది కేన్స్. నవోన్మేషన, సృజన, పరస్పర సహకారం ద్వారా వినోద రంగాన్ని ‘కళా నైపుణ్యాల సంగమం’గా మార్చడం వేవ్స్ లక్ష్యం.
వేవ్స్ అనేది కేవలం ఏదో భారీగా నిర్వహిస్తున్న కార్యక్రమం అనుకుంటే పొరపాటు. సృష్టికర్తలు, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవకాశాలను సృష్టించే వాస్తవ కార్యక్రమం. పురాతన ఇతిహాసాలు, జానపదాల నుంచి కృత్రిమ మేధ ఆధారిత కంటెంట్, డిజిటల్ రూపంలోని అద్భుతమైన కథనాల వరకు కథల విషయంలో దేశ వారసత్వానికి భారత్ పెవిలియన్ ఒక వేదికగా ఉంటుంది. దీని ద్వారా మన కథలు కాలాతీతమైనవని, మన కథనం అత్యాధునికమైనదని ప్రపంచానికి భారత్ చాటిచెప్తుంది. అదే సమయంలో ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి కంటెంట్ మార్కెట్ ప్లేస్ అయిన వేవ్స్ బజార్ కంటెంట్‌ విషయంలో కొనుగోలు, అమ్మకం, సరఫరా విధానాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉంది. సంప్రదాయ తీరులో పండగలప్పుడు మాత్రమే కొనుగోలు నమూనాను మార్చి ప్రపంచ స్థాయి లావాదేవీలు సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండేలా ఈ డిజిటల్-ఫస్ట్ ప్లాట్‌ఫామ్ చూసుకుంటుంది. తద్వారా దేశవిదేశాల్లోని కంటెంట్ సృష్టికర్తలకు ఎల్లప్పుడూ తమ సృజనాత్మకతను డబ్బుల రూపంలోకి మార్చుకునే (మానిటైజేషన్) వ్యవస్థ అందుబాటులో ఉండేలా చేస్తుంది.
ఇటీవల విజయం సాధించిన “డ్యూన్: రెండో భాగం”‌ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 2025 ఆస్కార్‌ను గెలుచుకుంది. దీనికి వీఎఫ్‌ఎక్స్‌ ను అందించింది మన కళాకారులే. ప్రపంచ స్థాయి వేదికలపై సృజనాత్మక సామర్థాన్ని ప్రదర్శించేందుకు, పెంపొందించేందుకు వేవ్స్ పెట్టుకున్న లక్ష్యానికి ఇది నిదర్శనం. పరిశ్రమ భావిస్తున్నదానికంటే వేవ్స్‌ను నిజంగా భిన్నంగా చేసేది- దానికి ఉన్న స్థూల దార్శనికత. ఇది ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు. వినోద రంగంలో సృజతాత్మకతకు ప్రపంచ స్థాయి ప్రధాన కేంద్రంగా భారత్‌ను నిలబెట్టే దీర్ఘకాలిక వ్యూహంతో కూడుకున్నది. ప్రపంచ మీడియా, వినోద రంగ పరిశ్రమ 2030 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని చేరుకునే దిశగా ప్రయాణిస్తోంది. భారత్ ఔట్‌సోర్సింగ్ కేంద్రంగా కాకుండా.. వినోద రంగంలో నిర్మాణం, విధానాలు, పెట్టుబడుల విషయంలో ప్రపంచ నాయకత్వం విషయంలో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. కంటెంట్ సృష్టించటం, ఆర్థిక వనరులు, విధానపరమైన చర్చలు, కొత్తగా ఆవిర్భవిస్తోన్న సాంకేతికతలను ఏకీకృతం చేస్తున్నందున ఈ సదస్సు- రేపటి వినోద రంగానికి పునాదిగా నిలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments