ఎక్కడ చూసినా మద్యమే!
జిల్లావ్యాప్తంగా పదిహేను వందలకు పైగా బెల్టు షాపులు
కిరాణా దుకాణాల్లోనే కొనసాగుతున్న వైనం
తాగునీరు దొరకదేమోగాని.. మద్యం మాత్రం గ్యారెంటీ
ఆగమవుతున్న పేదల బతుకులు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ యంత్రాంగం
ఫిర్యాదు చేస్తేనే దాడులు
జగిత్యాల మార్చ్ 0 (ప్రజాకలం జిల్లా ప్రతినిధి) :జిల్లాలోని పట్టణాల్లో,గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నది. కిరాణా దుకాణాల కంటే ఎక్కువగా మద్యం దుకాణాలున్నాయి. జిల్లాలోని పల్లెల్లో,పట్టణ ప్రాంతాల్లో వేసవి కాలంలో తాగునీటి కష్టాలు వస్తాయేమోకాని మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ దొరుకుతుండడం గమనార్హం. మద్యానికి బానిసలై ఎంతోమంది పేదల బతుకులు ఆగమవుతున్నప్పటికీ జిల్లా ఎక్సైజ్ శాఖ యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
బెల్టు షాపులు ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం.
ఎక్సైజ్ శాఖ కు ప్రతినెలా మామూళ్లు వస్తుండడంతో బెల్టుషాపుల నిర్వహణను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో సారా రక్కసి సమూలంగా పోయినప్పటికీ మద్యం ఏరులై పారుతున్నదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామూళ్లు అందడంతో చూసీచూడనట్లు..
జిల్లావ్యాప్తంగా కేవలం 71 లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలుండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించే బెల్టు షాపులు సుమారు పదిహేను వందలకు పైగా ఉన్నాయి. ఒకటి రెండు మినహా మిగతా కిరాణా దుకాణాల్లోనే బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే పట్టణ కేంద్రల లోని సంబంధిత అధికారుల ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న కిరాణా దుకాణాల్లో తెల్లవారుజాము నుంచే బహిరంగంగానే మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా మామూళ్లతో సరిపెట్టుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగితే తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు తదనంతరం ఎలాంటి కేసులు లేకుండా వదిలేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.ఎక్సైజ్ అధికారుల అండదండలతో గ్రామాల్లో యథేచ్ఛగా బెల్టు షాపులు కొనసాగిస్తున్నారు. మరోవైపు బెల్టు షాపుల్లో రూ.20 నుంచి రూ.50 వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల ద్వారా 40 శాతం మేర విక్రయాలు జరుగుతుండగా.. బెల్టు షాపుల ద్వారా 60 శాతం మేర జరుగుతుండడం గమనార్హం.
జిల్లా లో బెల్ట్ షాపులు లేవు..
మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
– సత్య నారాయణ , జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్
జిల్లా లో పట్టణాల్లో గాని, గ్రామాల్లో గాని అసలు బెల్ట్ షాప్ లు లేనే లేవు,బెల్ట్ షాప్ లు ఉన్నట్టు ఎవరూ ఫిర్యాదు చేసినా తప్పనిసరిగా స్పందించి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేస్తే బెల్టు షాపులను మూసివేస్తాం.