*విద్యతోనే మనకు అస్తిత్వం సాధ్యం. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జవహర్ నవోదయ విద్యాలయం వార్షిక దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.*
పాలేరు మార్చి 28(ప్రజా కలం న్యూస్)
కూసుమంచి మండల పరిధిలోని శుక్రవారం పాలేరు గ్రామంలోని
విద్యతోనే మనకు అస్తిత్వం లభిస్తుందని, మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
పాలేరు లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వార్షిక దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, అందరికీ విద్య అందించేందుకు మన దేశంలో సుదీర్ఘ పోరాటాలు జరిగాయని, గతంలో రాజుల కొడుకులకు, ప్రముఖులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేదని తెలిపారు.
చదువు లేకపోతే మన అస్తిత్వం కోల్పోతామని, ప్రతి చిన్న అంశంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుండి అందరికీ సమానంగా చదువు దక్కాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆలోచన చేపట్టిందని అన్నారు.
మన జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు విద్య తప్పనిసరి అని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం మనం బాగా చదువుకుంటే భవిష్యత్తులో మన అమ్మా, నాన్నలను బాగా చూసుకోవచ్చని అన్నారు. గతంలో తల్లిదండ్రులకు వివిధ కారణాల వల్ల చదువుకునే అవకాశం లభించలేదని, ప్రస్తుతం మనకు నవోదయ పాఠశాల వంటి అద్భుతమైన చోట చదువుకునే అవకాశం వచ్చిందని, దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
విద్యార్థులు వారి అమ్మా నాన్నలకు, టీచర్లకు అత్యధికంగా గౌరవం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మనకు విద్యాబుద్ధులు అందించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ టీచర్లు బోధిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగా లేకపోయినా పిల్లల కోసం పని చేస్తారని, మనం ఏం చేసినా వారి రుణం తీర్చు కోలేమని కలెక్టర్ తెలిపారు.
విద్యార్థులంతా పుస్తకాలు చదివే అలవాటు అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు ఒక గంట సమయం పుస్తకాలు చదివేందుకు కేటాయించాలని, పరీక్షల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదవాలని కలెక్టర్ తెలిపారు. ఫోన్లతో గడిపే సమయాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని , సామాజిక మాధ్యమాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
మనం రెగ్యులర్ గా చదవడం అలవర్చు కుంటే క్రమశిక్షణ, మంచి ప్రవర్తన ఏర్పడుతుందని అన్నారు. కఠినమైన ప్రవేశ పరీక్షకు ఉత్తీర్ణత సాధించి నవోదయ విద్యాలయాల్లో సీటు సాధించారని అన్నారు. మనకు లభించిన అవకాశం ద్వారా మరో నలుగురికి ఎలా సహాయపడాలి అనే ఆలోచన చేయాలని, ఇతరులను ఎప్పుడు చిన్నచూపు చూడవద్దని కలెక్టర్ తెలిపారు.
జీవితంలో మన లక్ష్యాలను సాధించిన తర్వాత సమాజంలో మరో నలుగురు అభివృద్ధి చెందేందుకు మనమంతా సహకారం అందించాలని, ఇతరులకు సహాయం చేయడంలో వచ్చే సంతృప్తి మనం ఎంత ఎత్తుకు ఎదిగిన దక్కదని కలెక్టర్ తెలిపారు. మనం జీవితం ఎలా గడిపాం అనే దానిపై చరిత్రలో మనకు స్థానం లభిస్తుందని అన్నారు.
పాఠశాలలో స్నేహితులు ఒకరికి మరొకరు చదువులో సహాయం చేసుకోవాలని, ఒకరు బలహీనంగా ఉన్న పాఠ్యాంశాలను మరొకరు బోధించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులంతా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి దేశానికి గొప్ప పేరు తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలలో విజేతలకు కలెక్టర్ జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ వెంకట రమణ, పేరెంట్ టీచర్స్ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
*విద్యతోనే మనకు అస్తిత్వం సాధ్యం. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Recent Comments
Hello world!
on