Friday, April 4, 2025
HomeUncategorizedలాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి

లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి

లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి
ఆయిల్ పామ్ పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి
వేంసూరు మండలం కల్లూరు గూడెంలో నూతన ఆయిల్ పామ్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఖమ్మం మార్చి 30(ప్రజా కలం న్యూస్)
వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లా రైతులు జాన్ నెలలో గోదావరి జలాలతో సాగు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఆదివారం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, టి.జి. ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డిలతో కలిసి నూతన ఆయిల్ పామ్ కర్మాగార పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయని, ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చే ఏ మొక్కలు కూడా కల్తీవి లేవని, నర్సరీ దశలోనే కల్తీ మొక్కలు కనిపెట్టడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సత్తుపల్లిలో అభివృద్ధి పనులు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టడం జరుగుతుందని అన్నారు. వేంసూరు మండలంలో రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గతంలో ఎన్టిఆర్ కాలువ పూర్తి చేశామని అన్నారు. రాజీవ్ లింక్ కాలువ పూర్తి చేసి వైరా నియోజకవర్గ పరిధిలో సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించామని అన్నారు.
జూన్ నెలలోపు సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొని వస్తామని, నాగార్జున సాగర్ నిండకపోయినా గోదావరి నీటితో వేంసూరు మండల చెరువులు నింపు తామని అన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందేలా సీతారామ ఎత్తిపోతల పథకం నీటి సరఫరా చేసేందుకు పెండింగ్ పనులకు సవరించిన అంచనాలను సీఎం ఆమోదించారని అన్నారు.
జాతీయ రహదారుల, ఆయిల్ పామ్ పంటల వృద్ది ఖమ్మం జిల్లాను చూసి ఇతర జిల్లాలు నేర్చుకోవాలని అన్నారు. ఖమ్మం నుంచి 33 నిమిషాలలో సత్తుపల్లికి వచ్చేలా కల్లూరు, వేంసూరు జాతీయ రహదారి ఎగ్జిట్ ఏర్పాటు చేశామని, ఆగస్టు 15 నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తూ రైతుల ఖాతాలలో 33 వేల కోట్లను సీఎం రేవంత్ రెడ్డి జమ చేశారని అన్నారు. రైతు భరోసా భవిష్యత్తులో ఇచ్చిన హామీ మేరకు చేస్తామని అన్నారు. పంటల భీమా పథకం త్వరలోనే ప్రభుత్వం ప్రారంభిస్తుందని, ఎటువంటి కారణాలతో పంట నష్టపోయినా పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు.
ఆయిల్ పామ్ పంటకు గిట్టుబాటు ధర 21 వేలు దాటే విధంగా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. హార్టికల్చర్ వ్యవసాయ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కువ ఆయిల్ పామ్ పంట సాగు ప్రారంభమైందని, రాబోయే 10 సంవత్సరాలలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని మంత్రి తెలిపారు.
ఆయిల్ పామ్ పంటకు కరువు, వరదలతో ఇబ్బందులు లేవని, 3 సంవత్సరాలలో పంట వచ్చే మొక్కలు అందిస్తున్నామని, రైతులు ఆలోచించి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని, పంట సాగు పెరిగే కొద్దీ అవసరమైన ఫ్యాక్టరీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మంచి రేటు లభిస్తుందని, గతంలో కూడా ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడామని అన్నారు. ఆయిల్ పామ్ పంటకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామని అన్నారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ, రైతులకు లాభం జరగాలనే ఉద్దేశంతో ఆయిల్ పామ్ పంటను మంత్రి తుమ్మల ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేంసూరు మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని, కల్లూరుగూడెం గ్రామంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ వచ్చే ఉగాది నాటికి పూర్తి అవుతుందని, నేరుగా 100 నుంచి 200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా వేలాది రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
ఆయిల్ పామ్ పంటకు ప్రభుత్వం అనేక రకాల సబ్సిడి అందిస్తుందని, 4 సంవత్సరాల కాలంలో దాదాపు 50 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తుందని, తక్కువ నీటితో పంట పండుతుందని, ఎకరం పంటతో లక్షల రూపాయలు సంపాదించవచ్చని, మొదటి నాలుగు సంవత్సరాల పాటు అంతర్ పంటల సాగు చేయవచ్చని, రైతులంతా ఆలోచించి లాభసాటి ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించాలని అన్నారు.
సీతారామ ప్రాజెక్టు క్రింద యాతాలకుంట టన్నెల్ పనులు వేగవంతం చేయడంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర మనకు ఉపయోగపడేలా 2 ఎగ్జిట్ లు ఏర్పాటు చేశామని అన్నారు. బుగ్గపాడులో ఫుడ్ పార్క్ నిర్మాణం పూర్తి చేశామని, త్వరలోనే అక్కడ కంపెనీల ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని అన్నారు.
టి.జి.ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా మాట్లాడుతూ, ఉగాది పర్వదినం సందర్భంగా 4వ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గంటకు 15 నుంచి 60 మెట్రిక్ టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో 102 కోట్ల రూపాయల అంచనాతో అధునాతన ఆయిల్ పామ్ కర్మాగారం ఏర్పాటుకై ప్రణాళికలు రూపొందించామని, ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసామని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 30 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుందని, సంవత్సరానికి 60 వేల మెట్రిక్ టన్నుల ఆయిల్ పామ్ దిగుబడి వస్తుందని, ఇది భవిష్యత్తు రోజుల్లో లక్షా 50 వేల మెట్రిక్ టన్నులకు చేరుతుందని అన్నారు. అత్యున్నత టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల మంచి దిగుబడి సాధ్యం అవుతుందని అన్నారు.
మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 వేల మంది రైతులను ఒప్పించి 2 లక్షల 50 వేల ఎకరాల సాగు ఆయిల్ పామ్ క్రింద తీసుకుని వచ్చామని అన్నారు. ప్రతి రైతుకు పొలం దగ్గర నుంచే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కంపెనీలు పంట కొనుగోలు చేసేందుకు చట్టబద్దత కల్పించామని, 3 రోజులలో డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖల అధికారులు, తెలంగాణ, ఆంధ్రా ఆయిల్ పామ్ అధ్యక్షులు, ప్యాక్స్ డైరెక్టర్ లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments