నిలకడగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి
గురుకులను సందర్శించిన జిల్లా వైద్యాధికారి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, ఏప్రిల్ 15 (ప్రజాకలం): కోరుట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మంగళవారం సందర్శించారు. కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన దృష్ట్యా కళాశాలలో పనిచేసి స్థానిక ఏ ఎస్ .ఎం. వారిని వెంట బెట్టుకుని అల్లమయగుట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చింది.వైద్యాధికారి డాక్టర్ శివాని వారిని పరిశీలించి చికిత్స అందించారు. జ్వరంతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలను కోరుట్ల ఏరియా హాస్పిటల్ కు రిఫర్ చేయగా అక్కడి వైద్యాధికారులు పరిశీలించి వారిని అడ్మిట్ చేసుకొని చికిత్స అందించారు. డాక్టర్ శివాని ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారికి తెలుపగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కి ప్రమోద్ కుమార్ కళాశాలను సందర్శించి అక్కడ కళాశాల ప్రిన్సిపాల్ తో చర్చించి వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరీక్షించి చికిత్స అందజేశారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం టీ హబులోని ల్యాబ్ కు పంపించారు. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. పాఠశాల సెలవులు ముగిశాక విద్యార్ధులు ఎండలో తిరుగకుండా పగటి సమయంలో ఆటలు ఆడకుండా ఉదయము, సాయంత్రం సమయాలలో మాత్రమే ఆటలు ఆడుకోవాల్సిందిగా సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో ఎండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీలు గాని, టవల్స్ గాని చుట్టుకోవాలని తెలిపాడు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి కోరుట్ల లోని ఏరియా హాస్పిటల్ ను సందర్సించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత తో మాట్లాడే విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్ధుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ అంకం సురేశ్, వైద్యాధికారులు డాక్టర్ సమీన, డాక్టర్ శివాని, హెల్త్ ఎడ్యుకేటర్ తులసి వెంకటరమణ, ఎపిడమాలజిస్ట్ వంశీ, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీధర్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.