సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం
– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 2 (ప్రజాకలం) : సన్న బియ్యం పంపిణీ పథకం చరిత్రలో నిలిచిపోయే పథకమని మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని బుధవారం మెట్ పల్లి పట్టణంలోని 13వ వార్డు రేగుంటలో గల రేషన్ దుకాణంలో వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. అంతే కాకుండా ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పీజీ కనెక్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చతామని తెలిపారు. కాగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఎమ్మార్వో ఆర్ శ్రీనివాస్, ఎడ్మాల లక్ష్మారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కొమ్ముల సంతోష్ రెడ్డి, పార్టీ మెట్ పల్లి మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా, మెట్ పల్లి ఆర్ఐ ఉమేష్, రేగుంట గ్రామస్తులు పాల్గొన్నారు.