కొండెక్కిన కోడికూర ధర…
– ఎండల తీవ్రత దృష్ట్యా ఉత్పత్తి తగ్గడమే కారణం
– ప్రస్తుతం కిలో చికెన్ 280 నుంచి 300 రూపాయలు
– చికెన్ ప్రియులకు తప్పని ధరాభారం!
ఎల్లారెడ్డి ఏప్రిల్ 02 ప్రజా కలం ప్రతినిధి : ప్రస్తుతం చికెన్ ధరలకు రెక్క లొచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు అమాంతంగా పెరిగి పోయాయి. కిలో చికెన్‌పై ఏకంగా సుమారు 100 రూపాయలు పెరగటం గమనార్హం. వారం కింద.. రూ.200 నుంచి 220 వరకు పలికిన కిలో చికెన్ ధర ఇప్పుడు.. అర కిలో మటన్ కొనెంత స్థాయికి పెరగటం సామాన్యులను బెంబె లెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ.. సామాన్యులను బెంబే లెత్తిస్తున్నాయి. గత వారంలో హైదరాబాద్ లాంటి ప్రధాన పట్టణాల్లో కిలో చికెన్ (స్కిన్ లెస్) ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. ఇక.. విత్ స్కిన్ అయితే.. కేవం రూ.180 నుంచి రూ.200 మాత్రమే. కాగా ఇప్పుడు కిలో చికెన్ ధర పెడితే గ్రామాల్లో అర కిలో మటన్ వచ్చే పరిస్థితి ఉంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చికెన్ (స్కిన్ లెస్) రూ.300 వరకు పలుకుతుంది. స్కిన్‌తో అయితే.. రూ.280 ఉంది. పెరిగిన చికెన్ ధరలు చూసి చికెన్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. వారంలోనే ధరలు ఇంతలా పెరగటం చూసి.. ఆశ్చర్యపోతున్నారు. ఏపీలోని ప్రధాన పట్టణాల్లోనూ చికెన్ ధరలు ఇలాగే మండిపోతున్నాయి.
తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు…
ఓవైపు చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోతుంటే.. మరోవైపు.. నిన్నమొన్నటి వరకు పెరుగుతూ పోయిన కోడి గుడ్ల ధరలు మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. గత వారంలో రూ.7 పలికిన కోడిగుడ్డు… ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో 5 రూపాయలు పలుకుతోంది. అయితే.. కోడి గుడ్ల ధరలు ఇంతకన్నా తగ్గే ఛాన్స్ లేదని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. అయితే.. చికెన్ ధరలు మాత్రం ఎండలు పెరిగే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎండలు పెరుగుతుంటే.. కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని.. దీంతో కోళ్ల లభ్యత తగ్గి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
చికెన్ రేట్లు పెరగడానికి కోళ్ల దాణా ధరలు పెరగటం కూడా ఓ కారణం…
చికెన్ రేట్లు పెరగడానికి కోళ్ల దాణా ధరలు పెరగటం కూడా ఓ కారణంగా చెప్తున్నారు ఫౌల్ట్రీ రైతులు. కోళ్ల దాణా ధరలలో పెరుగుదల కారణంగా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయని వారు చెప్తున్నారు. కోళ్ల దాణాలో ఉపయోగించే సోయా, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి పడిపోవడంతో.. మార్కెట్‌లో వీటి ధర పెరిగిపోతోంది. దీంతో చికెన్ ధర కూడా అమాంతంగా పెరిగి పోయింది. అలాగే వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని.. దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని చెప్తున్నారు. దీంతో కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని చెప్పారు. ఏదేమైనా చికెన్ ప్రజలకు పెరిగిన ధరలు కాస్త ఇబ్బంది కలిగించడం వాస్తవం.