పడకేసిన పారిశుధ్యం…
– ఏడో వార్డులో నిలిచిన మురుగునీరు
– దోమలు దుర్వాసనతో ప్రజల ఇక్కట్లు
– పట్టించుకోని అధికారులు… ఇబ్బందుల్లో ప్రజలు
మెట్ పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 4 (ప్రజాకలం) : పట్టణంలోని ఏడో వార్డులో పారిశుధ్యం పడకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఆ వార్డులో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యం మెరుగుపర్చాలని వార్డు ప్రజలు కోరుతున్నపటికీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వార్డులో మురుగు కారణంగా ప్రబలుతున్న వ్యాధులు…
వార్డులో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలతో చిన్నారుల నుంచి పెద్దల వరకూ అల్లాడుతున్నారు. ప్రజానీకం వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వార్డులో మురికి కాలువల్లో చెత్తను తొలగించడంతో పాటు మురుగునీటిని బయటకు పంపి బ్లీచింగ్ చల్లాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వార్డులో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహించవలసి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో అక్కడ నిత్యం పారిశుద్ధ పనులు జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మురికి కాలువలు పూర్తిగా నీటితో నిండిపోయి దుర్గంధం వెద జల్లుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వార్డులో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము…
– బోలుమల్ల లవ కుమార్, వార్డు యువకుడు, మెట్ పల్లి
సుమారు గత పక్షం, ఇరవై రోజులుగా మా వార్డులో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులను నిర్వహించడం లేదు. మురికి కాలువలో చెత్తను తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మురుగునీరు కారణంగా దోమలు కూడా పెరిగిపోయి ప్రజలు విషజ్వరాలకు గురవుతున్నారు. చిన్నపిల్లలు నిత్యం విష జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నాము.