Sunday, April 6, 2025
Homeతెలంగాణఅంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్

అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్

అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్

మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి వెల్లడి

మెట్ పల్లి: ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజా కలం)గత కొంతకాలంగా మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నట్లు మెట్ పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుని వివరాలు తెలిపారు. నిందితుని వద్ద మల్లాపూర్ ఎస్సై కే రాజు 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పి ఏ రాములు పర్యవేక్షణలో, మెట్ పల్లి సీఐ ఏ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించిందన్నారు.18 న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మల్లాపూర్ ఎస్సై కే రాజు తన సిబ్బందితో కలిసి ముత్యంపేట గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, మోటార్ సైకిల్ పై వస్తున్న నిందితుడిని అనుమానాస్పద స్థితిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో నిందితుడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు.నిర్మల్ జిల్లా. స్వస్థలం: బైంసా కు చెందిన లక్ష్మణ్ @ పుండలిక్ విజయ్ చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి రాజీవ్ నగర్, బైంసాలో ఉండేవాడన్నారు. అతనికి నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు ఉన్నారన్నారు. నలుగురు అన్నదమ్ములలో లక్ష్మణ్ మూడవ వాడని, 6వ తరగతి వరకు బైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడన్నారు. పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో తండ్రి కొట్టడంతో ఇంటి నుండి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడన్నారు.. అక్కడ దాతలు పెట్టిన భోజనం తింటూ రైల్వే స్టేషన్ లోనే పడుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత నాంపల్లిలోని భావర్చి హోటల్ లో 3 సంవత్సరాలు టేబుల్ క్లీనర్ గా పనిచేశాడన్నారు. హోటల్ యజమాని జీతం సరిగా ఇవ్వకపోవడంతో గొడవపడి బయటకు వచ్చాడు. నాంపల్లి కూలీ అడ్డాలో కూలీగా పని చేస్తుండగా, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడన్నారు. అతను పని ఇప్పిస్తానని గుల్బర్గా, కర్ణాటకకు తీసుకువెళ్లి దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించాడన్నారు.ఒకరోజు ఆ వ్యక్తి లక్ష్మణ్ ను గుల్బర్గా రైల్వే స్టేషన్ లో వదిలి పారిపోయాడన్నారు. లక్ష్మణ్ తిరిగి హైదరాబాద్ వచ్చి అక్కడక్కడ పనులు చేస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడన్నారు. కూలీ పనితో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడన్నారు.

లక్ష్మణ్ ఒంటరిగా బస్సుల్లో వివిధ గ్రామాలకు వెళ్లి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలు పగలగొట్టి, బీరువాలు తెరిచి బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు దొంగిలించేవాడన్నారు. రోడ్లపై నిలిపి ఉంచిన తాళం లేని మోటార్ సైకిళ్లను కూడా దొంగిలించి, వాటిని ఉపయోగించి మరికొన్ని దొంగతనాలు చేసి, వదిలివేసేవాడన్నారు. దొంగిలించిన సొమ్ముతో లాడ్జిల్లో ఉంటూ జల్సాలు చేసేవాడన్నారు.లక్ష్మణ్ ఇప్పటి వరకు 40 దొంగతనాలు చేయగా, 28 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు. 12 కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అతను గతంలో మూడుసార్లు (మహబూబ్ నగర్, జగిత్యాల, కరీంనగర్) పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయాడన్నారు. చివరగా, ఆగస్టు 2024లో నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో ఒక దొంగతనం, అక్టోబర్ 2024లో కమ్మర్పల్లి మండలంలో ఒక దొంగతనం చేసి, పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళాడని సిఐ వివరించారు.డిసెంబర్ 2024లో బెయిల్ పై బయటకు వచ్చి మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో ఒక దొంగతనం, ముత్యంపేట గ్రామంలో మరొక దొంగతనం, మెట్ పల్లి పట్టణంలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం, మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో మరొక దొంగతనం చేశాడని నిరంజన్ రెడ్డి తెలిపారు.ఈ అంతర్ జిల్లా గజదొంగను చాకచక్యంగా పట్టుకున్న మెట్ పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై కే రాజు, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు మెట్ పల్లి డిఎస్పి ఏ రాములు ను ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments