మహా విశిష్టం… మహాశివరాత్రి
– ఉపవాసం, జాగారంతో భక్తుల పూజలు
– పండుగ రోజు కిక్కిరిసిపోనున్న శివాలయాలు
– లోక కల్యాణం కోసం శివ పార్వతుల కళ్యాణం
– భక్త జన సందోహంగా మారనున్న వేములవాడ
జగిత్యాల ఫిబ్రవరి 25(ప్రజాకలం జిల్లా ప్రతినిధి) : హిందువుల ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఆ రోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
భక్తులు ఆ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.
శివరాత్రి జాగరణ, ఉపవాసం ఎంత మహిమాన్వితమైనవో తెలుసా…
శివరాత్రి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన దినం. ఆ రోజు ప్రతి శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు జనులందరూ. ప్రతి చోటా శివాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం.. మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుంటే..
శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..
మహాశివరాత్రి హిందూ మతంలో ప్రసిద్ధ పర్వదినం. ఈ రోజున చాలామంది ఆ పరమశివుడుని ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తారు. మహాశివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం సంకల్పించుకుంటారు. తరువాత మరుసటి రోజు సూర్యోదయం తరువాత ఉపవాసం విరమిస్తారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని, తమ కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడని అంటారు. అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని అనుకునే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
మహాశివరాత్రి అంటే చాలామందికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషంగా విషాన్ని కూడా ఆనందంగా తాగిన విషయమే గుర్తుకు వస్తుంది. దీనికి తగినట్టు శివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు జరుగుతాయి. శివుడు సేవించిన విషం నుండి ఆయన శరీరానికి ఓదార్పు లభించడానికే ఆయనకు అభికేకాలు చేస్తుంటారు. ఇకపోతే ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా మంది చేస్తారు.
మహాశివరాత్రి ఉపవాసం నియమాలు..
మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటే ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఉపవాసం ఉన్న రోజు స్వామిని ఆరాధిస్తూ, స్మరిస్తూ ఉండాలి. మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా శివలింగానికి సమర్పించిన నైవేద్యాలను స్వీకరించకూడదట. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు అలసత్వం చూపకూడదు. పేరుకు ఉపవాసం అని చెప్పి ఇతర ఆహారాలను తీసుకోకూడదు. కేవలం పండ్లు, పాలు తప్ప వేరే ఏ ఆహారాలు ఉపవాసంలో తీసుకోకూడదు. మహాశివరాత్రి ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా శివుడికి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయాలి. దీనివల్ల ఉపవాస ఫలితం పెరుగుతుంది. శివరాత్రి రోజు శివనామ జపం, శివ ఆరాధన తప్పనిసరిగా చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు అయినా తొలగుతాయి. ఉపవాస సమయంలో తృణధాన్యాలు, ఉప్పు, తరిగిన కూరలు, నూనె.. మొదలైన వాటిని నిషేధించడం మంచిది. శివరాత్రి రోజు పొరపాటున కూడా ఇంట్లోకి మాంసం లేదా మద్యం తీసుకురాకూడదు. ఇంట్లో ఎవరైనా నాస్తికులు ఉండి ఇవన్నీ కావాలని అనుకుంటే వారిని బయటకు వెళ్లి వారికి ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పాలి.
సంపూర్ణ ఉపవాసం కాకుండా ఒక్కపొద్దు ఉండేవారు ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని నిషేధించాలి. పూర్తీగా సాత్వికాహారం తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇతరులను దూషించడం, నిందించడం, ఇతరులతో కఠినంగా మాట్లాడటం, అబద్దాలు చెప్పడం వంటివి చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసును దేవుడి మీదనే లగ్నం చేయాలి. పై నియమాలు అన్నీ పాటిస్తే ఉపవాస ఫలితం దక్కుతుంది.